ఆ చింత నీకేలరా…నీ చెంత నేనుండగా

7 03 2012

http://www.youtube.com/watch?v=IAlBW8OxAYc&feature=watch-now-button&wide=1#t=1h15m34s

సంగీతం: కె.వి మహదేవన్
గానం: సుశీల
దర్శకత్వం: కె.విశ్వనాథ్
చిత్రం: శుభోదయం (1980)
తారాగణం: చంద్రమోహన్, సులక్షణ

మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే, మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె, తరంగిణులకు?

ఆ చింత నీకేలరా

ఆ చింత నీకేలరా
స్వామీ…నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా
స్వామీ…నీ చెంత నేనుండగా

ఆ చింత నీకేలరా

సొంతమైన ఈ సొగసులేలక
పంతమేల పూబంతి వేడగా

సొంతమైన ఈ సొగసులేలక
పంతమేల పూబంతి వేడగ

ఆ చింత నీకేలరా

సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడునీ తోడు పెట్టీ

సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడునీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా

ఆ చింత నీకేలరా
నీ చెంత నీకేలరా
ఆ చింత నీకేలరా

ఆ వంక ఆ వెన్నెలమ్మ
ఈ వంక ఈ వన్నెలమ్మా

ఆ వంక ఆ వెన్నెలమ్మ
ఈ వంక ఈ వన్నెలమ్మా
యే వంక లేని నెల వంక నేనమ్మ
నీకింక అలకెందుకమ్మా

లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే, కుటజములకు?
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే, సాంద్ర నీహారములకు?
వినుత గుణశీల మాటలు వేయునేలా ?
ఆ చింత నీకేలరా
స్వామీ…నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

సినిమాలో, ఒక భర్త తన తోడల్లుడు ఆస్తిని హారతి కర్పూరం లాగా కార్ల మీద కరిగించేస్తున్నాడని, తనకొచ్చేసరికి మామగారి ఆస్థిలోని వాటాకి తనకేమి మిగలదేమో అని భార్య దగ్గర వాపోతూ ఉంటాడు.తన భర్తని ఎటువంటి స్వార్థమూ, ఫలాపేక్ష లేని వాడని నమ్మే ఆ అమాయకురాలు, భర్తని తన బావగారికంటే ఉత్తముడిగా పోలుస్తూ, అతనిని బుజ్జగిస్తూ పాడే సందర్భములోది ఈ పాట.

బమ్మెర పోతన రాసిన శ్రీమధ్భాగవతం లోని ప్రహ్లాద చరితము లోని ఒక పద్యము నుంచి కొన్ని వాక్యాలను సందర్భోచితంగా ఈ పాటలో వాడారు వేటూరి.

“మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే, మదనములకు?”
మందార పువ్వులలోని తేనెలను తాగుతూ, ఆ మాధుర్యములో తేలుతున్న తేనెటీగ ఉమ్మెత్త పూవుల జోలికి వెళ్ళాలని తలుస్తుందా ?

“నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె, తరంగిణులకు?”
నిర్మలంగా సాగే మందాకినీ నదిలో ఊయలూగుతున్న హంస, అలల తాకిడిని కావాలనుకుంటుందా?

“లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే, కుటజములకు?”
కుటజము అంటే అంకుడుచెట్టనే ఒక రకమైన చెట్టట. లేత ఆకులను తిని ఆనందపడే కోయిల కుటజం చెంత చేరుతుందా ?

“పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే, సాంద్ర నీహారములకు?”
నిండు చంద్రుడి లేత కిరణాలను గ్రోలే చకోర పక్షి, దట్టమైన నక్షత్ర వీధిని కోరుకుంటుందా ?

ఉమ్మెత్త పువ్వులు, సంద్రం లోని అలలు, అంకుడు చెట్లు, నక్షత్ర వీధులూ వంటి గొప్ప విషయాలు ప్రకృతిలో ఎన్ని ఉన్నా, గుండెని తడిమి తృప్తి పర్చగల ఔన్నత్యం మాత్రం నిరాడంబరమైన వాటికే సొంతం. ఆ నిరాడంబరతలోని సౌందర్యాన్ని మనసుని కట్టిపడేసే మాటలతో పాట కట్టిన వేటూరికి పాదాభివందనాలు.

“సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడునీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా”

ఈ నాలుగు లైన్లని వెనక్కి తిప్పి తిప్పి ఎన్ని సార్లు విన్నానో !! వేటూరి గారి టిపికల్ మాటల గారడికి కమ్మటి మీగడ పెరుగులాటి ఉదాహరణలివి. సరసాల మనుగడనేమో సగ”పాలు” చేసీ, దానికి ఆమె ఈడుని “తోడు”గా పెడితే తయారైన పెరుగు మీగడలని కరిగించి కౌగిళ్ళుగా తినిపించగా…ఆహహా…నా జిహ్వని కవ్వించడంతో పాటు,మనసుని కూడా గిలిగింతలు పెట్టింది ఈ పాట.

ఈ పాట విన్నాకో, వింటూ చూసాకో, వెన్న ముద్దల కమ్మదనాన్ని, వెన్నెల చల్లదనాన్ని, పిల్ల తెమ్మెర పంచుతున్న హాయినీ, భర్త అలక తీర్చడానికి ప్రయత్నిస్తున్న ఆ ముగ్ధ సోయగాన్ని అనుభవించి పరవశించని మనసు ఏదన్నా ఉంటే, దానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

********************************************************************************************************





రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

31 07 2009

సంగీతం:M.M కీరవాణి
గానం:M.M కీరవాణి
రచన:వేటూరి
చిత్రం:మాతృదేవోభవ

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
||రాలిపోయే పువ్వా||
చెదిరింది నీ గూడు గాలిగా
చిలకా గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తన వాడు తారల్లో చేరగా
మనసూ మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై…వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై…ఆశలకే హారతివై
||రాలిపోయే పువ్వా||
అనుబంధమంటేనే  అప్పులే
కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే
తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే
పగిలే ఆకాశము నీవై…జాలిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై…తీగ తెగే వేణియవై
||రాలిపోయే పువ్వా||




మౌనమేలనోయి

13 07 2008
ఇక్కడ వినండి

చిత్రం:సాగర సంగమం
దర్శకత్వం:కాశీనాథుని విశ్వనాథ్
సంగీతం:ఇళయరాజా
రచన:వేటూరి
గానం:బాలు

మౌనమేలనోయి
మౌనమేలనోయి…ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి…ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల…వెలిగే కన్నులా
ఎదలో వెన్నెల…వెలిగే కన్నులా
తారాడే హాయిలో
ఇక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

పలికే పెదవి…వొణికింది ఎందుకో
వొణికే పెదవి…వెనకాల ఏమిటో
కలిసే మనసులా…విరిసే వయసులా
నీలి నీలి వూసులు…లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా     |
మౌనమేలనోయి|

హిమమే కురిసే…చందమామ కౌగిట
సుమమే విరిసే…వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా…వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు…కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసిన    |
మౌనంమేలనోయి|





రేపల్లియ యద ఝల్లున

1 05 2008

ఆబాలగోపాలం(పిల్లలు,పెద్దలు అందరూ)మా బాలగోపాలుని,అచ్చెరువున(ఆశ్చర్యముతో)..అచ్చెరువున(ఆ చెరువు దగ్గర) విచ్చిన కన్నుల చూడ…తాండవమాడిన సరళి,గుండెల మ్రోగిన మురళి…ఇదేనా…

జీవన రాగమై బృందావన గీతమై …కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి  ఇదేనా….
మధురా నగరిలో యమునా లహరిలో …ఆ రాధ ఆరాధనా గీతి పలికించి …

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి

వేణు గానాన్ని ఇంతకంటే అందంగా వర్ణించిన పాట ఇంకోటి లేదేమో తెలుగులో … హ్యాట్సాఫ్ టు వేటూరి

చిత్రం:సప్తపది (1981)
రచన:వేటూరి
సంగీతం:కె.వి.మహదేవన్
దర్శకత్వం:కె.విశ్వనాథ్

ఇక్కడ వినండి

రేపల్లియ యద ఝల్లున
పొంగిన రవళి
నవరస మురళీ
అ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ
మోహన మురళీ |రేపల్లియ యద ఝల్లున|

కాళింది మడుగున
కాళీయుని పడగనా
ఆబాలగోపాల
మా బాలగోపాలుని |కాళింది మడుగున|
అచ్చెరువున అచ్చెరువున
విచ్చిన కన్నుల చూడ |అచ్చెరువున|

తాండవమాడిన సరళి
గుండెల మ్రోగిన మురళి
ఇదేనా…ఇదేనా
ఆ మురళీ

అనగల రాగమై
తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి
మరులే కురిపించి |అనగల రాగమై|

జీవన రాగమై బృందావన గీతమై
ఆ..ఆ
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళీ

ఆ..ఆ…ఆ
వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళీ
ఆ నందన మురళీ
ఇదేనా…ఆ మురళీ
మువ్వల మురళి
ఇదేనా…ఆ మురళీ

మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
ఆ…ఆ..ఆ
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా
ఇదేనా…ఆ మురళీ
రేపల్లియ యద ఝల్లున
పొంగిన రవళి
నవరస మురళీ
అ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ
మోహన మురళీ